Vijayashanti: ఎవరూ అడగకపోయినా ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచారు: విజ‌య‌శాంతి

vijay shati slams tdp

  • స్వరాష్ట్రం ఏర్పడితే కొలువులు వస్తాయని ఆశించారు
  • ప్ర‌భుత్వం ఆ విష‌యాన్ని ప‌క్క‌కు పెట్టింది
  • రిటైర్ అయిన వారికి ప్ర‌యోజ‌నాలు అంద‌ట్లేదు 
  • ఏడేండ్లలో ఏటా వందల సంఖ్యలో రిటైర్మెంట్లు  
  • ఉద్యోగాల భర్తీపై ఎలాంటి పట్టింపు లేదంటూ విమర్శ  

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మండిప‌డ్డారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామో ఆ క‌ల‌లు నెర‌వేర‌డం లేద‌ని చెప్పారు. 'స్వరాష్ట్రం ఏర్పడితే కొలువులు వస్తాయని యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడికక్కడ రోడ్ల పైకి వచ్చి ఉద్యమించారు.

ఇక యూనివర్సిటీల్లో చదివే స్టూడెంట్స్ చదువులు పక్కనపెట్టి విలువైన సమయం, విద్య కోల్పోయి, ఉద్యమం చేసి స్వరాష్ట్రంలో నేడు నిరుద్యోగులుగానే మిగిలారు. ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సిన కేసీఆర్ సర్కార్... ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఎవరూ అడగకపోయినా ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచి, వారికి రిటైర్మెంట్ సమయంలో చెల్లించాల్సిన మొత్తాన్ని ముందుకు జరిపేందుకు కుట్ర చేసి నిరుద్యోగులను నిండా ముంచింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.91 లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయని... బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చి సంవత్సరం దాటినా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యకుండ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇక ఏడేండ్లలో ఏటా వందల సంఖ్యలో రిటైర్మెంట్లు జరిగినా... ఉద్యోగాల భర్తీపై ఎలాంటి పట్టింపు లేక సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సునీల్ నాయక్ మొదలు ఇంకెంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడి కన్నవాళ్లకు కన్నీటి శోకాన్ని మిగుల్చుతున్నారు.

ఆత్మహత్యలు, ఉద్యోగ ఖాళీల గురించి స్పందించకుండా కేవలం ఎన్నికలప్పుడే ఉద్యోగాల భర్తీపై మాట్లాడుతూ... ఎన్నికలు అయిపోయాక వాటి ఊసెత్తకుండా పోవడంతో నిరుద్యోగులకు అర్హత వయసు దాటిపోయి చేసేదేం లేక... బలవన్మరణానికి పాల్పడేలా చేస్తున్న ఈ రాక్షస ముఖ్యమంత్రికి భవిష్యత్తులో యావత్ తెలంగాణ నిరుద్యోగ యువతరం గట్టి గుణపాఠం ఇవ్వక మానరు' అంటూ విజ‌యశాంతి విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News