Rock garden: రాళ్లే కదా అని తీసేయొద్దు.. ఘన చరిత్ర ఉంది.. అరుదైన శిలలతో హైదరాబాద్ లో రాక్ మ్యూజియం
- హబ్సిగూడ ఎన్జీఆర్ఐలో ఏర్పాటు
- 65 రకాల శిలలు
- అతి ప్రాచీనమైన రకాలు
- ప్రజల సందర్శనకు అనుమతి
అరుదైన శిలలను చూడాలనుకుంటే హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఉన్న ఎన్జీఆర్ఐకి వెళ్లాల్సిందే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ప్రత్యేకమైన శిలలతో (రాళ్లు) ఇక్కడ రాక్ మ్యూజియం ఏర్పాటు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భూమిలో లభించే విలువైన, అరుదైన శిలలు ఇక్కడ కనిపిస్తాయి.
మొత్తం 45 రకాల శిలలను ఇక్కడ ఏర్పాటు చేశారు. 330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినవిగా భావిస్తున్న డాసైట్ రాక్ శిల కూడా ఇక్కడ కనిపిస్తుంది. 55 మిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన శిలలను కూడా ఉంచారు. అనంతపురం జిల్లాలో కనిపించే డోలమైట్, ఖమ్మం జిల్లాలో కనిపించే పెట్రిపైడ్ వుడ్ రాయి, లైమ్ స్టోన్, హనీ ఎల్లో, కింబర్ లైట్.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ రాక్ మ్యూజియంను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ గురువారం ప్రారంభించారు.
భూమికి 175 కిలోమీటర్ల లోతు నుంచి సేకరించిన శిల కూడా ఇక్కడ కొలువుదీరింది. ప్రతీ శిల పక్కన దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం, చారిత్రక ప్రాధాన్యం తెలుసుకునే ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఈ రాక్ మ్యూజియం ఎంతో ఉపయోగకరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా అన్ని పనిదినాల్లో సందర్శించేందుకు అనుమతించనున్నారు.