Shivraj Singh Chouhan: నువ్వు రెండుసార్లు ముఖ్యమంత్రివి... నేను నాలుగుసార్లు సీఎంని: కేసీఆర్ పై శివరాజ్ సింగ్ చౌహాన్ ఫైర్

Madhya Pradesh CM Shivraj Singh Chouhan fires on CM KCR
  • ఇటీవల బండి సంజయ్ అరెస్ట్
  • సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన బీజేపీ అగ్రనేతలు
  • హైదరాబాద్ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం
  • ఇంత పిరికి సీఎంను ఎక్కడా చూడలేదంటూ వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో, తెలంగాణ సర్కారును బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా చేసుకుంది. బీజేపీ అగ్రనేతలు నేరుగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

ఉద్యమిస్తే భయపడుతున్నారని, అక్రమ అరెస్టులతో జైళ్లలో వేస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు తెగబడతారా? అయినా ఇంత పిరికి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు అంటూ విమర్శించారు. అవినీతి, నియంత పాలనను అంతం చేయడానికే బండి సంజయ్ పోరాడుతున్నారని, కేసీఆర్ కు కలలోనూ బండి సంజయ్ గుర్తొస్తున్నట్టుంది అని ఎద్దేవా చేశారు.

"బీజేపీ అంటే ఏమనుకుంటున్నారు? బిర్యానీ అనుకుంటున్నారా? కేసీఆర్ సంస్కారం అలవర్చుకోవాలి. కేసీఆర్ రెండుసార్లు సీఎం అయితే, నేను నాలుగుసార్లు సీఎంని. కానీ కేసీఆర్ లా సంస్కారహీనంగా ప్రవర్తించడంలేదు" అంటూ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు విస్మరించి, కుటుంబ పాలన నడిపిస్తున్న టీఆర్ఎస్ సర్కారును ప్రజలు గద్దె దింపుతారని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
Shivraj Singh Chouhan
KCR
BJP
Telangana
Madhya Pradesh

More Telugu News