Bandi Srinivasa Rao: ఫిట్ మెంట్ తగ్గినా మిగతా ప్రయోజనాల ద్వారా ఆ లోటు కనిపించదు.. సీఎం జగన్ కు కృతజ్ఞతలు: బండి శ్రీనివాసరావు
- ఫిట్ మెంట్ ప్రకటించిన సీఎం జగన్
- తెలంగాణ కంటే 7 శాతం తక్కువన్న బండి శ్రీనివాసరావు
- అయితే 6 డీఏలు ఒకేసారి ఇస్తున్నారని వెల్లడి
- ఇతర అంశాలు సంతృప్తికరంగా ఉన్నాయని హర్షం
ఏపీ సీఎం జగన్ తో భేటీ అనంతరం ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తమకు 23 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిందని, తెలంగాణతో పోల్చితే 7 శాతం తక్కువని అన్నారు. అయితే తాము తీసుకుంటున్న జీతాలతో పోల్చితే మెరుగైన విషయమేనని, తమకు పెండింగ్ లో ఉన్న 6 డీఏలను జనవరిలో ఇచ్చేస్తామని ప్రకటించారని, తద్వారా తమకు ఆ లోటు భర్తీ అవుతుందని వివరించారు. అందువల్ల ఫిట్ మెంట్ అంశంలో పెద్దగా బాధపడాల్సిందేమీలేదని బండి శ్రీనివాసరావు అన్నారు. జేఏసీ తరఫున సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
తెలంగాణలో రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు ఉంటే, మన రాష్ట్రంలో 62 సంవత్సరాలు అని ప్రకటించారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తామెవరం డిమాండ్ చేయలేదని, ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రెండు సంవత్సరాలు పెంపుదల చేయడం సంతోషదాయకమని అన్నారు. ఐఆర్ లో 7 శాతం తగ్గినప్పటికీ, మిగతా అంశాల ద్వారా ప్రభుత్వం సర్దుబాటు చేస్తోంది కాబట్టే తాము సంతృప్తిగా ఉన్నామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి కూడా కొంత సహకరించాలన్న ఆలోచనతో కొన్ని అంశాల్లో తాము పట్టుదలకు పోలేదని స్పష్టం చేశారు. అయినా సంతృప్తికి హద్దు ఉండదని, ప్రస్తుత ప్రకటన నేపథ్యంలో తమ క్యాడర్ కు తాము నచ్చజెప్పుకుంటామని తెలిపారు.