Justin Trudeau: మాస్కులు లేకుండా విమానంలో జల్సా... "ఇడియట్స్" అని తిట్టిన కెనడా ప్రధాని

Canadian Prime Minister fires on no mask passengers

  • డిసెంబరు 30న కెనడా నుంచి మెక్సికో వెళ్లిన విమానం
  • విమానంలో పార్టీ ఏర్పాటు చేసిన క్లబ్ యజమాని
  • మద్యం సేవిస్తూ ధూమపానం కూడా చేసిన మగువలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • కరోనా వేళ ఇలాంటి పార్టీలా? అంటూ ఆగ్రహావేశాలు

సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో వైరల్ అవుతోంది. అందులో విమానంలో కొందరు ప్రయాణికులు మాస్కులు కూడా లేకుండా పార్టీ చేసుకుంటుండడం చూడొచ్చు. కరోనా నిబంధనలు గాలికి వదిలి మద్యం, ధూమపానంతో జల్సా చేస్తుండడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ వీడియో చూసి ఆగ్రహం వెలిబుచ్చారు.

మాస్కుల్లేకుండా ఉన్న ఆ విమానంలోని ప్రయాణికులను చూసి "ఇడియట్స్" అంటూ తిట్టారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తున్న తరుణంలో ఈ విమాన ప్రయాణం చూస్తుంటే ముఖంపై చెళ్లున చరిచినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఎంతో అసహనానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. ఆ విమానంలోని వ్యక్తులు తాము ప్రమాదంలో పడడమే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రమాదంలో పడవేస్తున్నారని విమర్శించారు.

జస్టిన్ ట్రూడో ఆగ్రహానికి కారణం ఉంది. ఆ విమానం కెనడా నుంచే బయల్దేరింది. వాస్తవానికి అదొక చార్టర్డ్ విమానం. మెక్సికో వెళుతోంది. జేమ్స్ అవాద్ అనే వ్యక్తి విమానంలో పార్టీ ఏర్పాటు చేశాడు. జేమ్స్ అవాద్ 111 అనే ప్రైవేటు క్లబ్ యజమాని. డిసెంబరు 30న సన్ వింగ్ విమానయాన సంస్థ నుంచి ఓ చార్టర్డ్ విమానం మాట్లాడుకుని అందులో పార్టీ ఏర్పాటు చేశాడు.

అయితే ఈ విమానంలోని దృశ్యాలు వైరల్ కావడంతో, ఆ ప్రయాణికులకు చిక్కొచ్చిపడింది. వారందరూ కెనడా నుంచి మెక్సికోలోని కాంకన్ వెళ్లారు. ఈ వీడియోపై ఆగ్రహావేశాలు పెల్లుబుకడంతో సన్ వింగ్ సంస్థ తమ విమానాన్ని హుటాహుటీన వెనక్కి పిలిపించింది. ఇతర విమానయాన సంస్థలు కూడా ఆ ప్రయాణికులను కాంకన్ నుంచి వెనక్కి తీసుకురాబోమని, వారిని తమ విమానాల్లో ఎక్కనివ్వబోమని స్పష్టం చేశాయి. వారిని తమ విమానాల్లో ఎక్కిస్తే ఇతర ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎయిర్ కెనడా, ఎయిర్ ట్రాన్ శాట్ వంటి విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News