MS Dhoni: పాకిస్థాన్ ఆటగాడికి గిఫ్టు పంపిన ధోనీ
- పాక్ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న హరీస్ రవూఫ్
- ఎక్స్ ప్రెస్ పేస్ తో రాణిస్తున్న వైనం
- టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ధోనీతో చిట్ చాట్
- మూడ్నెల్ల తర్వాత గిఫ్టు అందుకున్న రవూఫ్
భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన సారథిగా ఖ్యాతి పొందిన మహేంద్ర సింగ్ ధోనీ ఎంతోమందికి ఆరాధ్య క్రికెటర్. భారత్ లోనే కాదు, అనేక దేశాల్లోనూ ధోనీకి అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రజలే కాదు, పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ఈ ఝార్ఖండ్ డైనమైట్ ఆటను అభిమానిస్తారు. అలాంటివారిలో పాకిస్థాన్ స్పీడ్ స్టర్ హరీస్ రవూఫ్ ఒకడు.
ప్రస్తుత క్రికెట్లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసేవాళ్లలో రవూఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీ20 క్రికెట్లో పాకిస్థాన్ జట్టు ఇటీవల సాధించిన విజయాల్లో రవూఫ్ పాత్ర కూడా ఉంది. ఇక రవూఫ్ కు టీమిండియా మాజీ సారథి ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత రవూఫ్ తన క్రికెట్ హీరో ధోనీని కలిసి ముచ్చటించాడు. అయితే, ఆ భేటీ ముగిసిన మూడు నెలల తర్వాత ధోనీ నుంచి రవూఫ్ కు ఓ కానుక అందింది.
ఆ కానుక ఓ జెర్సీ. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తాను ధరించే జెర్సీని ధోనీ తమ జట్టు మేనేజర్ రస్సెల్ ద్వారా రవూఫ్ కు పంపించాడు. ధోనీ నెం.7 జెర్సీ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ జెర్సీని అందుకున్న క్షణాన రవూఫ్ ఆనందం అంతాఇంతా కాదు.
"లెజెండ్, కెప్టెన్ కూల్ తన జెర్సీని పంపించడం ద్వారా నన్ను ఎంతో సంతోషానికి గురిచేశాడు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. నెం.7 అనేది ధోనీ మంచితనం వల్ల ఇప్పటికీ హృదయాలను గెలుచుకుంటూనే ఉంది" అంటూ రవూఫ్ తన స్పందన వెలిబుచ్చాడు. అంతేకాదు, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజర్ రస్సెల్ కు కూడా రవూఫ్ కృతజ్ఞతలు తెలిపాడు. భారత సరిహద్దులు దాటిస్తూ పాకిస్థాన్ కు గిఫ్టు పంపించడంలో కీలకపాత్ర పోషించిన రసెల్ కు థ్యాంక్స్ అంటూ స్పందించాడు. ఈ మేరకు ధోనీ నుంచి వచ్చిన జెర్సీని తన సోషల్ మీడియాలో ప్రదర్శించాడు.