Sankranti: సంక్రాంతి ఎఫెక్ట్... కాచిగూడ రైల్వే స్టేషన్ లో పెరిగిన రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర
- ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న ప్లాట్ ఫామ్ లు
- రద్దీని తగ్గించేందుకు కాచిగూడ స్టేషన్ లో ప్లాట్ ఫామ్ టికెట్ ధరల పెంపు
- ఈ నెల 20 వరకు అమల్లో ఉండనున్న పెరిగిన ధరలు
సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలను రైల్వేశాఖ పెంచింది. హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 20కి పెంచారు. నిన్నటి వరకు దీని ధర రూ. 10గా ఉంది. ఈరోజు నుంచి టికెట్ ధర రెట్టింపయింది.
సంక్రాంతి నేపథ్యంలో సొంత ఊళ్లకు ప్రజలు బయల్దేరుతున్నారు. వారిని రైల్లో ఎక్కించేందుకు కూడా కుటుంబసభ్యులు, స్నేహితులు వస్తుండటంతో ప్లాట్ ఫామ్ లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ప్లాట్ ఫామ్ పై రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫామ్ టికెట్ ధరను పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. పెరిగిన ధరలు ఈ నెల 20వ తేదీ వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. అయితే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో మాత్రం పాత ధరలే కొనసాగుతున్నాయి.