Ram Gopal Varma: సినిమా టికెట్ ధరలపై మరో ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
- టికెట్ ధరల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వర్మ
- జనవరి 10న పేర్ని నానిని కలవనున్న వర్మ
- టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించలేదని తాజా ట్వీట్
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నారంటే... దాన్ని ఒక పట్టాన వదలిపెట్టరు. ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ల అంశంపై ఆయన పూర్తి ఫోకస్ చేశారు. సినిమా టికెట్ల ధరను తగ్గించే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి, ప్రభుత్వానికి ఆయన పలు ప్రశ్నలను సంధించారు.
మరోవైపు తనకు అపాయింట్ మెంట్ ఇస్తే ఇండస్ట్రీ తరపున అన్ని విషయాలను వివరిస్తానని పేర్ని నానిని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన పేర్ని నాని... జనవరి 10 మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయానికి రావాలని ఆర్జీవీకి తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రికి నిన్న ఆర్జీవీ థ్యాంక్స్ చెప్పారు.
ఇంతలోనే ఆయన ఇదే అంశంపై మరో ట్వీట్ చేశారు. 'సినిమాలు, థీమ్ పార్కులు, మ్యూజిక్ కన్సర్టులు, మేజిక్ షోల వంటివి ఎంటర్టైన్ మెంట్ కిందకు వస్తాయి. వీటి టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించలేదు' అని ట్వీట్ చేశారు.