Telangana: ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి బలంగా వీస్తున్న గాలులు.. నేడు, రేపు వడగళ్ల వానలు!
- రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు
- వాయవ్య ప్రాంతాల్లో గాలుల్లో అస్థిరత
- సాధారణం కంటే రెండు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే, వాయవ్య ప్రాంతాల్లో గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత కొంత తగ్గింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.