COVAXIN: కొవాగ్జిన్ బూస్టర్ డోసుతో కొవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ.. క్లినికల్ పరీక్షల్లో వెల్లడి

 Covaxin booster shot may provide long term immunity against severe Covid

  • కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొన్న కొవాగ్జిన్
  • ఐదురెట్లు అధికంగా యాంటీబాడీలు
  • పిల్లలు, పెద్దల్లోనూ ఒకేరకమైన ఫలితాలు
  • ప్రపంచస్థాయి టీకా ఆవిష్కరించాలన్న లక్ష్యానికి అనుగుణంగానే ఫలితాలన్న డాక్టర్ కృష్ణ 

కరోనా టీకా కొవాగ్జిన్‌ బూస్టర్ డోసుతో కరోనా వైరస్ నుంచి మరింత మెరుగైన రక్షణ లభిస్తున్నట్టు తేలిందని టీకాను ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్ పేర్కొంది. క్లినికల్ పరీక్షల్లో ఇది మెరుగైన ఫలితాలను కనబరిచినట్టు వివరించింది. కొవాగ్జిన్‌ను బూస్టర్ డోసుగా తీసుకున్న 90 శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌ను సమర్థంగా అడ్డుకోగలిగే యాంటీబాడీలు ఐదు రెట్లు అధికంగా వృద్ది చెందాయని వివరించింది. అలాగే, రోగ నిరోధకశక్తి కూడా అధికంగానే ఉన్నట్టు స్పష్టమైందని తెలిపింది. ఫలితంగా కొవాగ్జిన్‌ను బూసర్ట్ డోసుగా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు కరోనా నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది.

అంతేకాదు, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని స్పష్టం చేసింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసుగా కొవాగ్జిన్ ఇచ్చి ఫలితాలను విశ్లేషించినట్టు భారత్ బయోటెక్ వివరించింది. క్లినికల్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలపై ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. కరోనాకు ప్రపంచస్థాయి టీకా ఆవిష్కరించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగానే ఈ ఫలితాలు ఉన్నట్టు చెప్పారు. పెద్దలు, పిల్లల్లోనూ ఇది ఒకే రకమైన ఫలితాలు ఇస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో వెలుగు చూసే వైరస్ ఉత్పరివర్తనాలపైనా మూడు డోసుల కొవాగ్జిన్ టీకాతో అత్యున్నత రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News