Uttar Pradesh: ఎన్నికల వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కారు.. విద్యుత్ చార్జీలు సగానికి సగం తగ్గింపు

UP CM Adityanath slashes power tariff by 50 percent

  • బోరుబావుల కనెక్షన్ల యూనిట్ ధరను రూ. 3 తగ్గించిన ప్రభుత్వం
  • గ్రామీణ ప్రాంతాల్లో పంప్‌సెట్ కనెక్షన్ల యూనిట్ ధరను రూపాయి చేసిన వైనం
  • ఎన్నికల షెడ్యూలకు కాస్త ముందుగా నిర్ణయం
  • రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందన్న సీఎం

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయ వినియోగ విద్యుత్ చార్జీలను సగానికి సగం తగ్గించింది. పట్టణాల్లోని బోరుబావుల కనెక్షన్లకు సంబంధించి ప్రస్తుతం యూనిట్‌కు రూ. 6 వసూలు చేస్తుండగా దీనిని మూడు రూపాలయలకు తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పంప్‌సెట్ కనెక్షన్ల యూనిట్ ధరను రెండు రూపాయల నుంచి రూపాయికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

పట్టణాల్లోనూ ఫిక్స్‌డ్ చార్జీల ధరలను తగ్గించింది. హార్స్ పవర్‌‌కు ఇప్పటి వరకు రూ. 130 వసూలు చేస్తుండగా, దానిని రూ. 65కు తగ్గించింది. గ్రామాల్లో ఇది రూ. 70గా ఉండగా, రూ. 35 చేసింది. అలాగే, మీటర్లు లేని కనెక్షన్ల హార్స్ పవర్ రేటును రూ. 170 నుంచి రూ. 85కు తగ్గించింది.

ఈ సందర్భంగా సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కాస్త ముందుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 10న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News