Hemant Soren: ఝార్ఖండ్ సీఎం నివాసంలో 15 మందికి కరోనా
- దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కరోనా
- ఝార్ఖండ్ సీఎం నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు
- సొరెన్ భార్య, పిల్లలకు కరోనా
- ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతున్న వైనం
- హోం ఐసోలేషన్ లో చికిత్స
దేశవ్యాప్తంగా కరోనా రక్కసి మళ్లీ చెలరేగుతోంది. కొత్త కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఝార్ఖండ్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ నివాసంలో కొవిడ్ కలకలం రేగింది. సీఎం నివాసంలో ఏకంగా 15 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హేమంత్ సొరెన్ అర్ధాంగి కల్పనా సొరెన్ తో పాటు వారి ఇద్దరి కుమారులు నితిన్, విశ్వజిత్ కు, హేమంత్ సొరెన్ బంధువు సరళా ముర్ము, ఓ అంగరక్షకుడికి కూడా కరోనా సోకింది.
నిన్న ఉదయం సీఎం అధికారిక నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షల్లో హేమంత్ సొరెన్, ఆయన మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్, సహాయకుడు సునీల్ శ్రీవాస్తవలకు కరోనా నెగెటివ్ వచ్చింది. కాగా, సీఎం నివాసంలో కరోనా పాజిటివ్ వచ్చినవారందరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. వారిని హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వివరించారు.