Furnas Lake: బ్రెజిల్ లో భయానక ఘటన... టూరిస్టు బోట్లపై విరిగిపడిన కొండరాయి... వీడియో ఇదిగో!
- ఫుర్నాస్ సరస్సు వద్ద ప్రమాదం
- పర్యాటకులతో వెళతున్న పడవలు
- ఒక్కసారిగా ఒరిగిపోయిన కొండరాయి
- ఏడుగురి మృతి
బ్రెజిల్ లో ఘోరం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న బోట్లపై కొండరాయి విరిగిపడడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. 32 మంది గాయపడ్డారు. వారిలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆగ్నేయ బ్రెజిల్ లోని ఫుర్నాస్ సరస్సులో ఈ భయానక ఘటన జరిగింది.
మినాస్ గెరాయిస్ రాష్ట్రంలో భారీ కొండరాళ్ల నడుమ ఉండే ఈ సరస్సు అందాలను చూసేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులతో పలు పడవలు సరస్సు ఎగువభాగాన ఉన్న జలపాతం వద్దకు వెళుతుండగా, పక్కనే ఉన్న కొండరాయి ఒక్కసారిగా ఒరిగిపోయింది. అది బోట్లపై పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. కొండరాయి నీటిలో పడడంతో నీరు ఒక్కసారిగా పైకి ఉబికింది. దీని ప్రభావంతో ఓ భారీ అల ఏర్పడడంతో ఒడ్డున ఉన్న బోట్లు కూడా దెబ్బతిన్నాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే బ్రెజిల్ నేవీ బృందాలు హుటాహుటీన సరస్సు వద్ద సహాయక చర్యలు ప్రారంభించాయి. ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఫుర్నాస్ సరస్సు 1958లో ఏర్పాటైంది.