Pushpa: బాక్సాఫీస్ వద్ద 'పుష్ప' వన్ హార్స్ రేస్.. హిందీలో ఇప్పటికీ జోరు మామూలుగా లేదు!
- ఇప్పటికీ పుష్పకు పోటీ ఇచ్చే సినిమా రాని వైనం
- రూ.80 కోట్ల క్లబ్‌లో చేరిన పుష్ప
- శుక్రవారం రూ.1.95 కోట్లు, శనివారం రూ.2.56 కోట్లు
- ఆదివారం రూ.3.48 కోట్లు
హిందీలో 'పుష్ప' జోరు మామూలుగా లేదు. విడుదలై 20 రోజులు దాటినప్పటికీ పుష్పకు హిందీలో పోటీ ఇచ్చే సినిమా ఇంతవరకు రాలేదు. దీంతో ఈ సినిమా రూ.80 కోట్ల క్లబ్‌లో చేరింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప హిందీలో వన్ హార్స్ రేస్ కొనసాగిస్తోందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.
ఈ విషయం ఈ వీకెండ్‌లోనూ నిరూపింతమైందని కొనియాడారు. ఇప్పటికీ ఈ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ భారత్‌లో నంబర్ 1గా ఉందని చెప్పారు. కరోనా సమయంలోనూ పుష్ప దూసుకుపోతోందని తరణ్ ఆదర్శ్ అన్నారు. ఈ సినిమా హిందీలో గత శుక్రవారం రూ.1.95 కోట్లు, శనివారం రూ.2.56 కోట్లు, ఆదివారం రూ.3.48 కోట్లు రాబట్టిందని ఆయన చెప్పారు. మొత్తానికి రూ.80.48 కోట్లు సాధించిందని వివరించారు.
ఈ సినిమా గత నెల 17న విడుదలైన విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి విభిన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఆలిండియా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. హిందీ మినహా ఇతర భాషల్లో ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ విడుదలైంది. భారత సినీ రంగంలో టాలీవుడ్ రేంజ్ ఏంటో పుష్ప ద్వారా మరోసారి నిరూపితమైంది.
ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా లేకపోవడంతో మరికొన్ని రోజులు పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ దూసుకుపోయే అవకాశం ఉంది. సుకుమార్ తనదైన రీతిలో సినిమాను తెరకెక్కించడం, అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి వారి నటన ఈ సినిమా ఇంతటి భారీ కలెక్షన్లు సాధించడానికి కారణమైంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.