Prime Minister: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించిన సుప్రీంకోర్టు

supreme court appaointed special comitte on pm security breach

  • సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు
  • పంజాబ్ డీజీపీ, ఏడీజీపీ, ఎన్ఐఏ ఐజీ తదితరులకు చోటు
  • ఇతర దర్యాప్తులు ఆపివేయాలని ఆదేశించిన సుప్రీం 

ప్రధాని నరేంద్ర మోదీ గత వారం పంజాబ్ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా వెలుగు చూసిన భద్రతా లోపాలపై దర్యాప్తునకు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
 
చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఇన్ స్పెక్టర్ జనరల్, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అడిషనల్ డీజీపీ ఈ కమిటీలో ఉంటారని కోర్టు పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విచారణ కమిటీలు తమ దర్యాప్తును నిలిపివేయాలని ఆదేశించింది.

స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం సోమవారం విచారణ నిర్వహించింది. ఇదే అంశంపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ సందర్భంగా పంజాబ్ తరఫున అడ్వొకేట్ జనరల్ డీఎస్ పట్వాలియా వాదనలు వినిపించారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పంటూ, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ ఏడు షోకాజు నోటీసులను కేంద్రం జారీ చేసినట్టు పట్వాలియా చెప్పారు. రాజకీయాలు దీని వెనుక ఉన్నందున కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ దర్యాప్తు పట్ల తమకు నమ్మకం లేదన్నారు. కోర్టు విచారణలో ఉన్నప్పుడు, అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు స్వాధీనం చేసినప్పుడు.. షోకాజు నోటీసులు ఎలా జారీ చేస్తారు? అని ప్రశ్నించారు.

దీనికి నోటీసులు ఎప్పుడు జారీ చేశారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్వమే పంజాబ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు జారీ చేసినట్టు చెప్పారు. పంజాబ్ ప్రభుత్వ అధికారులు వీవీఐపీ, ఎస్పీజీ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఈ ప్రక్రియ నేడు నిర్ణయించింది కాదని, ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు.

ఆందోళన చేస్తున్న రైతులకు 100 మీటర్ల దూరంలో ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయిందని, ఇందులో కచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన తీరును సమర్థించుకోవడం చాలా తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. దీంతో విచారణకు సుప్రీంకోర్టు స్వయంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News