Ram Gopal Varma: మంత్రి పేర్ని నానితో ముగిసిన రామ్ గోపాల్ వర్మ సమావేశం... వివరాలు ఇవిగో!
- వర్మకు అపాయింట్ మెంట్ ఇచ్చిన పేర్ని నాని
- అమరావతి సచివాలయంలో భేటీ
- భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వర్మ
- భేటీ 100 శాతం సంతృప్తికరంగా సాగిందని వెల్లడి
- థియేటర్ల అంశం మాట్లాడలేదన్న వర్మ
అమరావతి సచివాలయంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. అనంతరం వర్మ మాట్లాడుతూ, ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని వ్యతిరేకించానని వెల్లడించారు. ఏపీలో ఉన్న తక్కువ టికెట్ ధరలు దేశంలో మరెక్కడా లేవని చెప్పానని వివరించారు. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితిని వివరించానని తెలిపారు. ఓ సినీ నిర్మాతగా ప్రభుత్వానికి తన అభిప్రాయాలు చెప్పానని తెలిపారు.
టికెట్ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానని, మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావనకు తీసుకువచ్చారని వర్మ పేర్కొన్నారు. టికెట్ ధర పెరిగితే ప్రజలు ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారని వెల్లడించారు. టికెట్ ధర తగ్గిస్తే ఈ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుందని తాను చెప్పానని అన్నారు. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతలపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించానని వెల్లడించారు.
మరిన్ని అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం దోహదపడిందని తెలిపారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. అయితే సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినిమా పరిశ్రమపై ఉందని వర్మ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. చర్చలు జరిగిన తీరుపై 100 శాతం సంతృప్తిగా ఉందని తెలిపారు.
కాగా, థియేటర్ల మూసివేత అంశంపై తాను చర్చించలేదని వర్మ వెల్లడించారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి అగ్రనటులను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని తాను భావించడంలేదని అన్నారు. ఒకరిద్దరి కోసం యావత్ చిత్రపరిశ్రమను ఇబ్బంది పెడతారని అనుకోవడంలేదని స్పష్టం చేశారు.