Sadguru: సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండించిన సద్గురు, ఖుష్బూ
- ప్రధాని మోదీకి మద్దతుగా ట్వీట్ చేసిన సైనా
- పంజాబ్ ఘటనకు ఖండన
- తీవ్రస్థాయిలో స్పందించిన నటుడు సిద్ధార్థ్
- సిద్ధార్థ్ ట్వీట్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు
ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ని పంజాబ్ లో నిరసనకారులు అడ్డుకోవడంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందించడం, ఆమెపై నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. సైనాపై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సైనా నెహ్వాల్ యావత్ జాతికే గర్వకారణం అని కొనియాడారు. కానీ ఆమెపై వ్యాఖ్యలు అత్యంత ఏహ్యభావం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. బహిరంగ వ్యాఖ్యలతో పరిస్థితిని ఎటువైపు తీసుకెళుతున్నాం? అని ప్రశ్నించారు.
అటు, మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా స్పందించాడు. క్రీడాకారులు దేశం కోసం రక్తం చిందిస్తారని, జాతి గర్వించదగ్గ ఓ క్రీడాకారిణిపై అత్యంత చవకబారు భాష ఉపయోగించడం విచారకరమని పేర్కొన్నాడు. ఈ విషయంలో తాను సైనాకు మద్దతుగా నిలుస్తున్నానని, ఆ ట్వీట్ లో ఉపయోగించిన అభ్యంతరకర భాషను ఖండిస్తున్నానని రైనా స్పష్టం చేశాడు.
సిద్ధార్థ్ ట్వీట్ ను ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా ఖండించడం తెలిసిందే. సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
"సిద్ నువ్వు నా స్నేహితుడివి. కానీ నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం ఆశించలేదు. నువ్వు చేసిన ట్వీట్ చాలా దారుణంగా ఉంది. అంకుల్, ఆంటీ నీ ట్వీట్ ను ఏమాత్రం అంగీకరించరని కచ్చితంగా చెప్పగలను. నీలోని విద్వేషాన్ని ఓ వ్యక్తిపై ప్రదర్శించొద్దు" అంటూ ఖుష్బూ హితవు పలికారు.
కాగా, సిద్ధార్థ్ ట్వీట్ పై ఆగ్రహావేశాలే కాదు, ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతోంది. ఆ ట్వీట్ లో అంతర్జాతీయ పాప్ గాయని రిహాన్నా ప్రస్తావన ఉంది. "నీ పట్ల సిగ్గుపడుతున్నాను రిహాన్నా" అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. ఈ ట్వీట్ చూస్తుంటే అసలు సిద్ధార్థ్ మానసిక స్థితి ఏమాత్రం బాగాలేనట్టుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మధ్యలో రిహాన్నా ఏంచేసిందంటూ ప్రశ్నిస్తున్నారు.