Venkatesh: విద్యుత్ వాహనాలకు చార్జింగ్... విక్టరీ వెంకటేశ్ కొత్త వ్యాపారం
- 'బైక్ వో' సంస్థలో వెంకీ పెట్టుబడులు
- దేశవ్యాప్తంగా చార్జింగ్ పాయింట్లు
- సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించనున్న వెంకీ
- వెంకీ పెట్టుబడుల పట్ల హర్షం వ్యక్తం చేసిన బైక్ వో
టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో విద్యుత్ ఆధారిత వాహనాల ప్రాధాన్యత పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో, వెంకటేశ్ కొత్త వ్యాపారం షురూ చేశారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే 'బైక్ వో' సంస్థలో వెంకీ పెట్టుబడులు పెట్టారు. అయితే ఆయన పెట్టుబడి మొత్తం ఎంతన్నది తెలియరాలేదు. అయితే 'బైక్ వో' సంస్థలో భాగస్వామ్యం మాత్రమే కాదు, ఆ సంస్థకు వెంకటేశ్ ప్రచారకర్తగానూ వ్యవహరించనున్నారు.
'బైక్ వో' సంస్థలో పెట్టుబడులపై వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ ఫ్రాంచైజీ నెట్ వర్క్ లో మహిళలకు అవకాశాలు ఉంటాయని, వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. 'బైక్ వో' చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డి స్పందిస్తూ, వెంకటేశ్ తమ సంస్థలో పెట్టుబడులు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, మరో మూడేళ్లలో దేశవ్యాప్తంగా 20 వేల చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నది 'బైక్ వో' లక్ష్యంగా తెలుస్తోంది.