Real Estate: ఏపీ, తెలంగాణలో మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. రూ. 800 కోట్ల నల్లధనం లావాదేవీల గుర్తింపు
- ఈ నెల 5 నుంచి నాలుగు రోజులపాటు తనిఖీలు
- రూ. 1.64 కోట్ల నగదు పట్టివేత
- నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్‌ఫ్రా, స్కంధాని ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు?
యథేచ్ఛగా పన్ను ఎగవేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహించినట్టు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలిపింది. ఈ నెల ఐదు నుంచి నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు ఈ కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఈ సందర్భంగా ఏకంగా రూ. 800 కోట్ల నల్లధన లావాదేవీలను గుర్తించినట్టు పేర్కొంది. అలాగే, రూ. 1.64 కోట్ల నగదు కూడా పట్టుబడిందని వెల్లడించింది.
సోదాలు నిర్వహించిన మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కర్నూలు, విశాఖపట్టణం, అనంతపురం, నంద్యాల, బళ్లారి నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలతోపాటు వివిధ పట్టణాల్లో ఈ కంపెనీలకు చెందిన 24 కార్యాలయాల్లో ఈ నెల 5 నుంచి నాలుగు రోజులపాటు తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్‌ఫ్రా, స్కంధానీ ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.