Mudragada Padmanabham: ఇలాంటి వాటికి నేను భయపడను: ముద్రగడ పద్మనాభం
- కాపు, బీసీ, దళిత జాతులు పల్లకీ ఎక్కాలని ఇటీవల ముద్రగడ లేఖ
- సోషల్ మీడియాలో తనను బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారన్న ముద్రగడ
- ప్రస్తుత రాజకీయాల్లో బురద రాసుకుని ఇతరులకు అంటించడం పరిపాటిగా మారిందని మండిపాటు
తొలి నుంచి మనం ఇతరులకు పల్లకీలను మోస్తున్నామని... మనం కూడా పల్లకీపైన కూర్చోవాల్సిన సమయం ఆసన్నమయిందంటూ ఇటీవల కాపు, బీసీ, దళిత వర్గాల నేతలకు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాసిన సంగతి తెలిసిందే. జనాభా తక్కువ ఉన్న జాతులే అధికారాన్ని అనుభవించాలా? అని ఆయన ప్రశ్నించారు. అధిక జనాభా ఉన్న మన జాతులు అధికారపీఠంపై కూర్చోవాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ముద్రగడకు విమర్శల తాకిడి కూడా తగులుతోంది. తాను రాసిన లేఖపై వస్తున్న విమర్శలపై ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ, ఆయన మరో బహిరంగ లేఖను రాశారు.
ఇటీవలి రాజకీయాల్లో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించడం పరిపాటి అయిందని ఆ లేఖలో ముద్రగడ మండిపడ్డారు. పని చేస్తున్న వారిని దొంగలు, దగాకోరులు అని చెప్పించడం సాధారణ అంశంగా మారిందని అన్నారు.
కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చేయాలని ఆకాంక్షిస్తూ తాను రాసిన లేఖపై విమర్శలు చేస్తున్నారని... సోషల్ మీడియాలో తనను బండ బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పోస్టులకు తాను భయపడనని, పారిపోనని అన్నారు. బంతి మాదిరి ఎంత బలంగా కొడితే అంత వేగంగా పైకి లేస్తానని చెప్పారు.