Tata Group: వివోకి 'టాటా'... ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్
- 2018 నుంచి ఐపీఎల్ కు స్పాన్సర్ గా వివో
- ముగిసిన ఒప్పందం
- కొత్త స్పాన్సర్ గా టాటా గ్రూప్
- ఈసారి 10 జట్లతో ఐపీఎల్
అత్యంత ఆకర్షణీయమైన క్రికెట్ లీగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కొత్త స్పాన్సర్ వచ్చింది. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి టాటా గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఇప్పటివరకు స్పాన్సర్ గా వ్యవహరించిన చైనా ఫోన్ తయారీ దిగ్గజం వివోతో ఐపీఎల్ ఒప్పందం ముగిసింది.
లీగ్ నూతన స్పాన్సర్ గా టాటా గ్రూప్ వ్యవహరించనుందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ వెల్లడించారు. నేడు జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
2018-2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం వివో బీసీసీఐతో రూ.2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, 2020 సీజన్ సమయంలో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా, ఆ ఏడాది వివోను స్పాన్సర్ గా తప్పించారు. మరుసటి సీజన్ లో వివో మళ్లీ స్పాన్సర్ గా కొనసాగింది.
అయితే, కొత్త స్పాన్సర్ టాటా గ్రూప్ బీసీసీఐకి ఎంత మొత్తం చెల్లించనుందన్నది ఇంకా తెలియరాలేదు. ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు పోటీపడతున్న నేపథ్యంలో స్పాన్సర్ షిప్ మొత్తం కూడా భారీగానే ఉండే అవకాశాలున్నాయి. బీసీసీఐ కొత్తగా అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వడం తెలిసిందే.