IPL-2022: బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం... తేదీలు ఖరారు

IPL Mega Auction will be held in Bengaluru

  • ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ వేలం
  • ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు
  • కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్ల రంగప్రవేశం
  • ఆటగాళ్ల కొనుగోలు కోసం పెరగనున్న పోటీ

ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధమైంది. 2022 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఫిబ్రవరిలో నిర్వహించాలని ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది. ఇవాళ జరిగిన సమావేశంలో వేలం తేదీలు ఖరారు చేసినట్టు ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ వెల్లడించారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇక ఈసారి ఐపీఎల్ వేలానికి ఓ ప్రత్యేకత ఉంది. లీగ్ లో రెండు కొత్త జట్లు వచ్చిన నేపథ్యంలో ఆటగాళ్ల కోసం విపరీతమైన పోటీ ఏర్పడనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో 8 జట్లు పోటీపడగా, తాజాగా అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు 2022 సీజన్ లో బరిలో దిగుతున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు పూర్తిస్థాయిలో జట్లను ఎంపిక చేసుకోవాల్సి ఉన్నందున వేలంలో పలువురు ఆటగాళ్లకు భారీ ధర పలికే చాన్సుంది. అటు, ఇతర ఫ్రాంచైజీలు కూడా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వేలం ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాయి.

కాగా, దేశంలో కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ తాజా సీజన్ వేదికలపై అనిశ్చితి నెలకొంది. ఐపీఎల్ వేదికలను బీసీసీఐ ఇప్పటివరకు ఖరారు చేయలేదు. పూర్తిగా మహారాష్ట్రలోనే ఐపీఎల్ నిర్వహిస్తారంటూ ఓ ప్రతిపాదన ఉంది. వేదికల విషయమై ఫ్రాంచైజీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామంటున్న బీసీసీఐ.... నాలుగైదు స్టేడియంలను ఓ క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఆ స్టేడియంలలోనే అన్ని మ్యాచ్ లు జరిపే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలియజేసింది.

  • Loading...

More Telugu News