Bhupesh Baghel: ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడండి.. లేదంటే నా చావుకు అనుమతి ఇవ్వండి: రాష్ట్రపతికి చత్తీస్‌గఢ్ సీఎం తండ్రి లేఖ
- ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి
- ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన వ్యవస్థలు నాశనమవుతున్నాయి
- 25న ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నా మరణానికి అనుమతి ఇవ్వండి
చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సంచలన లేఖ రాశారు. ఇకపై దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లోను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా మళ్లీ బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించాలని కోరారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నందున మళ్లీ పాత పద్ధతినే అవలంబించాలని కోరారు. ఒకవేళ అలా జరగని పక్షంలో తన మరణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పౌరుల రాజ్యాంగ హక్కులను యథేచ్ఛగా హరిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. దేశ పౌరుల్లో భయం పెరుగుతోందని, ఇలాంటి వ్యవస్థలో తనకు బతకాలని లేదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడతానని మీరు ప్రమాణం చేశారని గుర్తు చేసిన నందకుమార్.. తన రాజ్యాంగ హక్కులకు రక్షణ లేదని, కాబట్టి తనకు మరణం తప్ప మరో మార్గం లేదని అన్నారు.
జనవరి 25న ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తన మరణానికి అనుమతి ఇవ్వాలని నందకుమార్ ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. కాగా, ఓటర్లను జాగృతం చేసే రాష్ట్రీయ మత్‌దాతా జాగృతి మంచ్‌కు నందకుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.