test Kits: యాంటీజెన్ పరీక్షనే నమ్ముకోవద్దు.. లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ కు వెళ్లాలి: వైద్యుల సూచన
- బాగా అమ్ముడుపోతున్న యాంటీజెన్ టెస్ట్ కిట్లు
- రెగ్యులర్ ఆర్టీపీసీఆర్ పరీక్షే మెరుగైనదంటున్న వైద్యులు
- ఇందులోనే అధిక శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయంటున్న నిపుణులు
కరోనా ఒమిక్రాన్ లో కనిపిస్తున్న ప్రధాన లక్షణాలు జలుబు, దగ్గు, గొంతులో సమస్య. దీంతో చాలా మంది ఈ లక్షణాలు కనిపించగానే ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ కిట్ తో ఇంటి వద్దే స్వయంగా పరీక్షించుకుంటున్నారు. దీనికి నిదర్శనం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు గణనీయంగా అమ్ముడుపోతుండడమే. పెరిగిన డిమాండ్ ను అవకాశంగా తీసుకుని కొన్ని ఫార్మసీ స్టోర్లు రూ.600 వరకు అమ్ముతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ కిట్ల ధర రూ.200-250 మధ్యే ఉంది.
పూర్వపు రెండు విడతల్లోనూ బాధితులు ఇంటి వద్ద టెస్ట్ కిట్లతో పరీక్షించుకోవడం పెద్దగా లేదు. కానీ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత రిటైల్ స్టోర్లలో టెస్ట్ కిట్లను కొనుగోలు చేసే వారు పెరిగినట్టు ఫార్మా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కానీ, చాలా మందికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల గురించి అవగాహన లేదు. సరైన విధానంలో శాంపిల్ సేకరించి పరీక్షించుకున్నప్పుడే ఫలితాలు కచ్చితత్వంతో వస్తాయి.
వినియోగానికి అనుకూలంగా ఉండడం, అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఉండడం, ఆర్టీపీసీఆర్ ఫలితాలు వెంటనే రాకపోవడం, టెస్ట్ ఖరీదు ఎక్కువగా ఉండడం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లకు డిమాండ్ పెరగడానికి కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కానీ, వైద్య నిపుణులు సొంతంగా కరోనా పరీక్ష చేసుకోవడం మెరుగైన ఆప్షన్ కాదంటున్నారు. రెగ్యులర్ టెస్ట్ ను వెంటనే చేయించే అవకాశం లేనప్పుడే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ తో పరీక్షించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ‘‘ఇంటి వద్ద చేసుకున్న పరీక్షలో ఒకవేళ ఫలితం నెగెటివ్ గా వచ్చి.. లక్షణాలు కనిపిస్తుంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ విధానమే మెరుగైనది’’ అని అపోలో వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ చెప్పారు.