transport department: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తెలంగాణ రవాణా శాఖ
- రేట్లను భారీగా పెంచేసిన ట్రావెల్స్ బస్సులు
- రంగంలోకి దిగిన 9 ప్రత్యేక తనిఖీ బృందాలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలకు సిద్ధం
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున జనం వెళ్లిపోతున్నారు. కరోనా కారణంగా తెలంగాణ సర్కారు 8వ తేదీ నుంచే విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. 16వ తేదీ వరకు సెలవులను ఇచ్చినా, వాటిని ఇంకా పెంచొచ్చన్న వార్తలు అనధికారికంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు ఐటీ కంపెనీలు, ఇతర సేవల రంగ కంపెనీల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం నడుస్తోంది. ఇవన్నీ కలిసొచ్చి పెద్ద సంఖ్యలో జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. నగరానికి దూరంగా పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్ బస్సులు కిటకిటలాడుతున్నాయి.
ఈ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ట్రావెల్స్ సంస్థలు చార్జీలను భారీగా పెంచేశాయి. దీంతో అడ్డగోలు దోపిడీకి చెక్ పెట్టేందుకు వీలుగా తెలంగాణ రవాణా శాఖ 9 ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దింపింది. ఇవి అంతర్రాష్ట్ర సర్వీసులను ఆపి తనిఖీ చేయనున్నాయి. పర్మిట్లు లేకపోయినా, అధిక చార్జీలను వసూలు చేసినట్టు ఆధారాలు లభిస్తే బస్సులను సీజ్ చేసేందుకు రవాణా శాఖ సన్నద్దమైంది.