door lock: ఇంటికి తాళం వేసి ఊరెళుతున్నారా..?: రాచకొండ సీపీ సూచనలు ఇవిగో
- ఊరెళ్లే విషయం సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు
- ఇంట్లో విలువైన వస్తువులు ఉంచొద్దు
- సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
- ఇంట్లో లైట్ వేసి, గుమ్మం ముందు చెప్పులు ఉంచి వెళ్లాలి
పండుగలకు ఇంటిల్లిపాదీ ఊరెళ్లడం సర్వసాధారణం. ముఖ్యంగా సంక్రాంతికి చాలా మంది పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళుతుంటారు. అలాంటి సమయంలోనే దొంగల ముఠాలు దోపిడీలకు ప్రణాళికలు వేసుకుంటుంటాయి. ఊరెళ్లొద్దని చెప్పడం లేదు కానీ, ఇంటికి తాళం పెట్టి వెళ్తున్న విషయం పక్క వారికి తప్పించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు.
‘‘ఊరెళుతున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు పెట్టడానికి, వాటిని షేర్ చేసుకోడానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే దొంగలకు కూడా సామాజిక మాధ్యమ ఖాతాలున్నాయి. ఇంటికి తాళం వేసినట్టు దొంగలకు తెలియకుండా వ్యవహరించాలి. తాళం వేసి కర్టెన్ వేయాలి. గుమ్మం ముందు చెప్పుల జతలు కొన్ని అలానే ఉంచేయాలి. ఇంట్లో లైట్ ఆన్ చేసి ఉంచాలి. విలువైన ఆభరణాలు, నగదు, డాక్యుమెంట్లను బ్యాంకు లాకర్లో ఉంచుకోవాలి. ప్రయాణంలో వెంట తీసుకుపోవడం కూడా సరికాదు.
ఇంటి డోర్లకు లాక్ అలర్ట్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఇరుగుపొరుగులో నమ్మకస్థులైన వారికి విషయం చెప్పి ఉంచాలి. సీసీటీవీ కెమెరాలను అమర్చుకుని, ఫోన్లకు అనుసంధానం చేసుకోవాలి’’ అని మహేష్ భగవత్ సూచించారు.