COVID19: వైరస్ తో కలిసి జీవించే స్థాయికి అమెరికాలో కరోనా: ఆంటోనీ ఫౌచీ
- కరోనాను అంతం చేయలేమని స్పష్టీకరణ
- కొత్త వేరియంట్లు పుడుతూనే ఉంటాయని కామెంట్
- వ్యాక్సిన్ వేసుకున్న వారికి తీవ్రత తక్కువేనని వెల్లడి
వైరస్ తో కలిసి జీవించే స్థాయికి అమెరికాలో కరోనా మహమ్మారి చేరిందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని చెప్పారు. సమాజం నుంచి కరోనాను అంతమొందించలేమని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ లాంటి వేరియంట్లు ప్రతి ఒక్కరికీ సోకుతాయని అన్నారు. కాబట్టి కరోనా అంతమవ్వడమన్నది అసాధ్యమన్నారు.
కరోనాలో మరిన్ని వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, వ్యాక్సిన్లు వేసుకోని వారిలోనే అవి పురుడు పోసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎన్ని వేరియంట్లు వచ్చినా తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, ఎక్కువ మంది దాని బారిన పడి ఉంటారు కాబట్టి.. సహజ రక్షణ లభిస్తుందని ఫౌచీ చెప్పారు. ప్రస్తుతం రోజూ పది లక్షల కేసులు నమోదవుతున్నాయని, లక్షన్నర మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని తెలిపారు.