amaravati: అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనకు ఎదురుదెబ్బ.. ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ!
- 19 గ్రామాలతో క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వం
- ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించిన 16 గ్రామాలు
- 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్ కే తాము అనుకూలమని చెప్పిన గ్రామాలు
ఏపీ రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన విషయం విదితమే. అయితే, ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అధికారులు నిర్వహించిన గ్రామ సభల్లో 16 గ్రామాలు క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.
ఈ రోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు. 2014 సీఆర్డీయే చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్ కు మాత్రమే తాము అనుకూలమని గ్రామ సభల్లో ప్రజలు స్పష్టం చేశారు. 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని... రాజధానిని ముక్కలు చేసే ప్రయత్నాన్ని మాత్రం తాము ఒప్పుకోబోమని చెప్పారు.