Assam: దొంగతనానికి వెళ్లి తీరిగ్గా కిచిడీ వండుకునే ప్రయత్నం.. 'వేడివేడి' ఆహారం వడ్డిస్తున్న పోలీసులు!
- అసోంలోని గువాహటిలో ఘటన
- అర్ధరాత్రి ఇంటి నుంచి శబ్దాలు రావడంతో దొరికిన దొంగ
- ఆహార దొంగ ఆసక్తికర కేసుగా అభివర్ణించిన పోలీసులు
ఓ ఇంటిని దోచుకునేందుకు వెళ్లిన దొంగ ఆకలి వేస్తుండడంతో కిచిడీ వండుకుని తినాలనుకున్నాడు. అన్నింటినీ వెతికి వంటకు సిద్ధమయ్యాడు. అయితే, అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి శబ్దాలు వస్తుండడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు లోపలికి వెళ్లి దొంగను చూసి అవాక్కయ్యారు. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అస్సాంలోని గువాహటిలో జరిగిందీ ఘటన. ఈ ఘటనపై ఆసాం పోలీసులు ట్విట్టర్‌లో సరదా వ్యాఖ్యలు చేశారు. ‘ఆహార దొంగ ఆసక్తికర కేసు’ అని కామెంట్ చేశారు. కిచిడీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, కానీ దొంగతనానికి వెళ్లినప్పుడు దానిని వండుకోవడం మీ శ్రేయస్సుకు హాని కలిగించవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు, దొంగను అరెస్ట్ చేసిన గువాహటి పోలీసులు అతడికి వేడివేడి ఆహారం వడ్డిస్తూ ఉండొచ్చని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లు కూడా ఈ ట్వీట్‌పై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.