china: ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా ఊరంతా ఇనుప పెట్టెల్లో బందీ కావలసిందే..: కరోనాపై చైనా 'ఉక్కు' అస్త్రం
- కరోనా నియంత్రణకు కఠిన వైఖరి
- చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ క్యాంపులు
- బస్సుల్లో అక్కడికి తరలింపు
- గర్భిణులు, పిల్లలనీ వదలడం లేదు
ప్రజల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలంటే అది చైనాకే సాధ్యం. ముఖ్యంగా కరోనా మహమ్మారి విషయంలో చైనా ఏ మాత్రం అలసత్వానికి చోటివ్వడం లేదు. మరో నెల రోజుల్లో బీజింగ్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుండడం కూడా అక్కడి సర్కారు కరోనాపై కఠినంగా వ్యవహరించేలా చేస్తోంది.
చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ క్యాంపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. రైలు పెట్టెల మాదిరిగా ఇనుప బాక్సులతో చిన్నపాటి గదులను నిర్మించింది. ఊర్లో ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా.. ఊరు మొత్తం ఇనుపు బాక్సుల్లో రెండు వారాల పాటు క్వారంటైన్ కావాల్సిందే. పిల్లలు, గర్భిణులు, వృద్ధులనే తేడా లేదు. అందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ బాక్సుల్లోకి నెట్టేస్తున్నారు.
ఇప్పుడు 2 కోట్ల మంది చైనీయులు ఈ బాక్సుల్లోనే క్వారంటైన్ అయి ఉన్నారు. జీరో కోవిడ్ పాలసీని అక్కడి సర్కారు కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే అర్ధరాత్రి వచ్చి నిద్రలేపి నిమిషాల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలి రావాలని హుకుం జారీ చేస్తున్నారు. బస్సుల్లో వారిని తరలిస్తున్నారు. ట్రాక్, ట్రేసెస్ యాప్స్ ను అధికారులు వినియోగిస్తున్నారు. ఇనుప బాక్సులో ఒక బెడ్, ఒక టాయిలెట్ మాత్రమే ఉంటుంది.