Dharam Singh Saini: యూపీలో బీజేపీకి ఎదురుగాలి... సమాజ్ వాదీ గూటికి చేరిన మరో మంత్రి

UP minister Dharam Singh Saini resigned and joins Samajwadi Party

  • ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామిప్రసాద్ మౌర్య
  • అదే బాటలో మరికొందరు బీజేపీ ప్రజాప్రతినిధులు
  • తాజాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన సైనీ
  • స్వాగతించిన అఖిలేశ్ యాదవ్

మరో నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఉత్తరప్రదేశ్ లో అధికార పక్షం బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇవాళ మరో మంత్రి రాజీనామా చేసి బీజేపీ శిబిరంలో మరింత కలకలం రేపాడు. మంత్రి ధరమ్ సింగ్ సైనీ పదవికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సైనీ తనను కలిసిన ఫొటోను సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ పార్టీలోకి మరోసారి సామాజిక యోధుడు వచ్చాడని వెల్లడించారు. ఆయనకు హార్దిక స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. తాము అనుసరిస్తున్న సానుకూల, ప్రగతిశీల రాజకీయాలకు విశేష ఆదరణ లభిస్తోందని అఖిలేశ్ యాదవ్ తెలిపారు.

కాగా, రాజీనామా సందర్భంగా ధరమ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా దళితులు, వెనుకబడిన వర్గాల వారు అణచివేతకు గురవుతున్నందునే రాజీనామా చేశానని వెల్లడించారు. స్వామి ప్రసాద్ మౌర్య మాటే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. జనవరి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఒక మంత్రి, ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూనే ఉంటారని తెలిపారు. కొన్నిరోజుల కిందట స్వామి ప్రసాద్ మౌర్య, మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఈ వలస ప్రస్థానం మొదలైంది.

  • Loading...

More Telugu News