IPL 2022: ఈసారి ఐపీఎల్ దక్షిణాఫ్రికాలో.. లేదంటే శ్రీలంక?
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- ఏప్రిల్ నాటికి కేసులు తగ్గకుంటే భారత్ వెలుపల ఐపీఎల్
- కరోనా కారణంగా గతేడాది సగంలో యూఏఈకి తరలిపోయిన ఐపీఎల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి కూడా భారత్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది భారత్లోనే ప్రారంభమైన ఐపీఎల్.. కరోనా రెండో దశ విజృంభణ కారణంగా మిగతా సగం పోటీలను యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. అంతకుముందు ఏడాది కూడా అక్కడే జరిగాయి.
ఇక ఈసారి మాత్రం భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో దేశంలో మరోమారు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. వచ్చే నెలకు కేసుల సంఖ్య పరాకాష్ఠకు చేరుకుంటుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ నాటికి దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోతే కనుక ఈసారి కూడా టోర్నీని భారత్ వెలుపలే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి యూఏఈ కాకుండా దక్షిణాఫ్రికాలో నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఒకవేళ దక్షిణాఫ్రికాలో నిర్వహించడం సాధ్యం కాకుంటే అప్పుడు శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కాగా, భారత్లో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009 ఐపీఎల్ దక్షిణాఫ్రికాలోనే జరిగింది.