Balakrishna: ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ.. సోదరి పురందేశ్వరి నివాసంలో సంక్రాంతి సంబరాలు

Tollywood top hero nandamuri balakrishna wishes on sankranthi
  • కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు
  • సంక్రాంతి అంటే మంచి మార్పు అని అర్థమన్న బాలకృష్ణ
  • ఈ పండుగ ఇంటింటా సంతోషాలు నింపాలని ఆకాంక్ష
టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. సోదరి పురందేశ్వరితో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ నిన్ననే కారంచేడు చేరుకున్నారు.

నేడు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ.. సంపద పెంచే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి చేరే పండుగ ఇదని, అందరిలోనూ ఆనందం నింపే పండుగ సంక్రాంతి అని అన్నారు.

క్రాంతి అంటే మార్పు అని, సంక్రాంతి అంటే మంచి మార్పు అని వివరించారు. ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకోవడం, రంగవల్లులతో సంక్రాంతిని ఆహ్వానించడం, పెద్దలను స్మరించుకోవడం, పశువులను పూజించడం వంటివి అనాదిగా వస్తున్న సంప్రదాయమని అన్నారు.

ప్రజల అభివృద్ధికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలని, ఇంటింటా సంతోషాలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్టు బాలకృష్ణ ఆకాంక్షించారు. కాగా, నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Balakrishna
Daggubati Purandeswari
Sankaranthi
Pongal

More Telugu News