India: రష్యా ఎస్ 400 క్షిపణుల కొనుగోలు వ్యవహారం .. భారత్ మీద ఆంక్షలపై అమెరికా స్పందన!
- ఆంక్షల విధాన కో ఆర్డినేటర్ స్పందన
- మిత్రుల మీద ఆంక్షలు ఎలా పెడతామనుకుంటున్నారు?
- టర్కీకి, భారత్ కు తేడా ఉందని కామెంట్
రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వినాశక వ్యవస్థలను భారత్ కొనుగోలు చేయడాన్ని అమెరికా మరోసారి ఆక్షేపించింది. తాము ఆ ఒప్పందాన్ని ఎంత మాత్రమూ అంగీకరించబోమని అమెరికా ఆంక్షల విధాన కోఆర్డినేటర్ గా అధ్యక్షుడు బైడెన్ నియమించిన నామినీ జేమ్స్ ఓబ్రయన్ చెప్పారు. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (క్యాట్సా) నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వాలని ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆంక్షల విషయంపైనా ఆయన స్పందించారు.
భారత్ తో ఉన్న భౌగోళిక రాజకీయ బంధాలు, పరిస్థితుల దృష్ట్యా దానిపై మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రత్యేకించి చైనాను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. ‘‘టర్కీ, భారత్.. రెండు వేర్వేరు పరిస్థితులు. రెండు భిన్న ధ్రువాలు. వాటివి వేర్వేరు రక్షణ భాగస్వామ్యాలు. శత్రువులపై విధించినట్టుగానే మిత్రులపైనా ఆంక్షలను ఎలా విధిస్తామని అనుకుంటున్నారు?’’ అని అన్నారు. ఆ రెండు దేశాలకు పోలికే లేదని, టర్కీ ప్రస్తావన అప్రస్తుతమని అన్నారు.