Akhilesh Yadav: బీజేపీ వికెట్లు టపటపా పడుతున్నాయి: అఖిలేశ్ యాదవ్
- ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర పరిణామాలు
- బీజేపీని వీడుతున్న ప్రజాప్రతినిధులు
- సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్న వైనం
- ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై
- తాజాగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలో చేరిక
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఏమాత్రం మింగుడుపడని పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారు. రోజూ ఎవరో ఒక మంత్రి రాజీనామా చేయడం, ఆయన వెంట ఒకరిద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ గూటికి చేరడం పరిపాటిగా మారింది.
ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ వికెట్లు టపటపా పడుతున్నాయని ఎద్దేవా చేశారు. క్రికెట్ ఆట ఎలా ఆడాలో ఈ సీఎంకు తెలియడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. మూడ్రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేయడం పట్ల ఆయన పైవిధంగా స్పందించారు.
తాజాగా ఇతర పార్టీల నేతలు కూడా సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అప్నాదళ్ పార్టీ ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి, బీఎస్పీ శాసనసభ్యులు బలరామ్ సైనీ, నీరజ్ కుమార్ కుష్వాహా కూడా సమాజ్ వాదీ గూటికి చేరారు.