Corona Virus: టీకా తీసుకోని వారి ప్రాణాలు హరిస్తున్న కరోనా: ఢిల్లీ ఆరోగ్య శాఖ గణాంకాలు ఇవే!
- ఢిల్లీలో ఈ నెల 9-12 మధ్య 97 మంది మృతి
- వీరిలో టీకా తీసుకున్న వారు 9 మంది మాత్రమే
- మరణాలను గణనీయంగా తగ్గిస్తున్న కరోనా టీకా
కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకాల పనితీరుపై చాలామందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడీ అనుమానాలను పటాపంచలు చేసింది ఢిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించిన నివేదిక. ఈ నెల 9 నుంచి 12 మధ్య ఢిల్లీలో 97 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది మాత్రమే టీకా తీసుకోగా, మిగిలిన వారెవరూ టీకా తీసుకోలేదు. అంటే, కరోనా టీకా తీసుకున్న వారికి ప్రాణాపాయం తక్కువని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
మృతుల్లో 90 శాతం మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు 239 రోజుల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇక, ఆఫ్రికా దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ వేగం తగ్గుముఖం పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరోవైపు, కరోనాతో అల్లాడిపోతున్న అమెరికా ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మాస్కులు అందించాలని నిర్ణయించింది.