Hyderabad: పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి పేరు చెప్పరూ.. నెటిజన్లను కోరిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్
- బంజారాహిల్స్‌లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న కమాండ్ కంట్రోల్ కేంద్రం
- అత్యుత్తమ పేరు సూచించిన వ్యక్తికి సత్కారం
- ట్విట్టర్‌లో పోటెత్తుతున్న పేర్లు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి మంచి పేరు సూచించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నెటిజన్లను కోరారు. చాలామంది దీనిని పోలీస్ టవర్స్, ట్విన్ టవర్స్ అని పిలుస్తున్నారని, అయితే ఇందులో నాలుగు టవర్లు ఉన్నాయని, కాబట్టి మంచి పేరు సూచించాలని ట్విట్టర్ ద్వారా కోరారు. నెటిజన్లు తాము సూచించాలనుకుంటున్న పేర్లను పోలీసు శాఖకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంపాలని కోరారు.
నెటిజన్ల నుంచి అందిన వాటిలో అత్యుత్తమమైన పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేస్తారని తెలిపారు. ఆ పేరును సూచించిన వ్యక్తిని కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవం రోజున సత్కరిస్తామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. సీవీ ఆనంద్ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు ఇప్పటికే పలు పేర్లను సూచించారు. వీటిలో ‘క్వాడ్ కాప్’, ‘పోలీస్ టవర్స్ 4.0’, ‘టీ టవర్స్’, ‘విజిల్స్ అర్బన్’, ‘తెలంగాణ పోలీస్ మినార్’, ‘రక్షక్ స్క్వేర్’ వంటివి ఉన్నాయి.