Omicron: కరోనా తదుపరి వేరియంట్ ను ‘తక్కువ’ అంచనా వేయలేం: శాస్త్రవేత్తలు

Expect more worrisome variants after Omicron scientists say
  • మరిన్ని రకాలు ఉద్భవించే అవకాశం
  • వైరస్ బలహీన పడుతుందని చెప్పలేం
  • మ్యుటేషన్ కు ఎక్కువ అవకాశాలు
కరోనా వైరస్ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా మొదటి రెండు విడతల్లో, ఆల్ఫా, డెల్టా వేరియంట్ల రూపంలో ఉగ్రరూపం చూపించింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత  తన రూపాలను మార్చుకుని ఒమిక్రాన్ వేరియంట్ గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. గతంలో మాదిరి ఆక్సిజన్ పడిపోవడం తదితర ప్రమాదకర లక్షణాలు కనిపించడం లేదు.

దీంతో కరోనా వైరస్ కథ ముగిసిపోవడానికి సమయం వచ్చిందని, ఇక మీదట వచ్చే రకాలు మరింత బలహీనంగా ఉంటాయని, సాధారణ ఫ్లూ మాదిరి మారిపోవచ్చంటూ కొందరు ఇప్పటికే తమ విశ్లేషణలు వ్యక్తం చేశారు. కానీ, తదుపరి వైరస్ రకం బలహీనంగా ఉంటుందని చెప్పడానికి లేదంటున్నారు పరిశోధకులు.  ఏ రూపాన్ని అది తీసుకుంటుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నది వారి అభిప్రాయంగా ఉంది.

‘‘ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కనుక మ్యుటేషన్ (వైరస్ పరివర్తన)కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతో మరిన్ని రకాలు ఉద్బవించేందుకు దారితీస్తుంది’’అని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఎపిడెమాలజిస్ట్ లియోనార్డో మార్టింజ్ అన్నారు.

ఇది ఎక్కువ కాలం ఉండే అంటువ్యాధి అని, కనుక కొత్త రకాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ నిపుణుడు డాక్టర్ స్టువార్ట్ క్యాంప్ బెల్ రే పేర్కొన్నారు. ఈ వైరస్ కాలక్రమేణా తక్కువ ప్రాణాంతకంగా మారుతుందని చెప్పడానికి ఏమీ లేదన్నారు.
Omicron
scientists
more varients
covid

More Telugu News