Starks: ప్రకాశం జిల్లాలో వాలిన 'విదేశీ అతిథులు'.... కంటికి రెప్పలా కాపాడుతున్న గ్రామస్థులు!

Foreign birds visits every year this village in Prakasham district

  • వెలమవారి పాలెంకు విదేశీ పక్షులు
  • ప్రతి ఏటా జనవరిలో రాక
  • ఇక్కడే గుడ్లు పెట్టి పొదిగే పక్షులు
  • పిల్లలకు రెక్కలు వచ్చాక స్వదేశాలకు పయనం

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారి పాలెం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది అన్ని గ్రామాల్లాంటిదే అయినా, మరెక్కడా కనిపించని రీతిలో ఇక్కడ విదేశీ పక్షులు వేల సంఖ్యలో దర్శనమిస్తాయి. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రకాశం జిల్లాకు వచ్చే విదేశీ కొంగ జాతి పక్షులు (వైట్ స్టార్క్) నేరుగా వెలమవారి పాలెం చేరుకుంటాయి. ఇవి పలు దేశాల నుంచి వలస వస్తాయి.

ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో వెలమవారి పాలెం చేరుకుని ఇక్కడే గుడ్లు పెట్టి, పొదుగుతాయి. ఇక పిల్లలకు రెక్కలు రాగానే జులై మాసంలో తమ దేశాలకు తిరిగి వెళతాయి. కాగా, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వచ్చే విదేశీ పక్షులను వెలమవారి పాలెం గ్రామస్థులు కంటికి రెప్పలా చూసుకుంటారు. ఎవరైనా కొత్తవారు వాటికి హాని తలపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు.

వెలమవారి పాలెం గ్రామం ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉంటుంది. కొరియా, నైజీరియా వంటి దేశాల్లో చలి ఎక్కువగా ఉండే కాలంలో ఆయా పక్షులు భారత్ వస్తాయి. అవి తమ గ్రామానికి రావడం తమకు ఎంతో సంతోషదాయకమని వెలమవారి పాలెం గ్రామస్థులు చెబుతుంటారు.

గతంలో కరవు కారణంగా పక్షులు కొన్ని మృత్యువాత పడ్డాయని, ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఎలాంటి ఇబ్బందిలేదని గ్రామస్థులు వివరించారు. కేవలం ఈ పక్షుల కోసమే గ్రామస్థులు పది ఎకరాల్లో చెరువు తవ్వించారంటే వాటిపై వీళ్లకు ఎంత ప్రేమ ఏర్పడిందో అర్థమవుతుంది. గతంలో ఓసారి వేటగాళ్లు పక్షులను వేటాడితే, పట్టుకుని పోలీసులకు అప్పగించారట.

ఈ ప్రాంతాన్ని పక్షి సంరక్షణ కేంద్రంగా మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. తద్వారా వేటగాళ్ల బారి నుంచి పక్షులను మరింతగా కాపాడుకోవచ్చని అంటున్నారు. కాగా, ఈ పక్షులను చూడ్డానికి దూరప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.

  • Loading...

More Telugu News