Lakshya Sen: భారత బ్యాడ్మింటన్ రంగంలో కొత్త కెరటం... ఇండియన్ ఓపెన్ టైటిల్ విజేత లక్ష్యసేన్
- ఫైనల్లో వరల్డ్ చాంపియన్ పై గెలుపు
- వరుస గేముల్లో నెగ్గిన లక్ష్య సేన్
- గత నెలలో వరల్డ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కైవసం
భారత బ్యాడ్మింటన్ రంగంలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు లక్ష్య సేన్. గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో లక్ష్య సేన్ సాధించిన విజయాల నేపథ్యంలో అతడిని భారత ఆశాకిరణంగా భావిస్తున్నారు. అది నిజమే అని నిరూపించేలా లక్ష్య సేన్ ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పురుషుల సింగిల్స్ విజేతగా అవతరించాడు. నేడు జరిగిన ఫైనల్లో లక్ష్య సేన్ వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ లో కీన్ యూ (సింగపూర్)పై ఘనవిజయం సాధించాడు.
20 ఏళ్ల లక్ష్య సేన్ గత నెలలో స్పెయిన్ లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇవాళ జరిగిన ఇండియన్ ఓపెన్ ఫైనల్లో అద్భుత ఆటతీరు ప్రదర్శిస్తూ 24-22, 21-17 తేడాతో వరుస గేముల్లో లో కీన్ యూని చిత్తు చేశాడు. ఈ టైటిల్ సమరం 54 నిమిషాల్లో ముగిసింది.
అటు, పురుషుల డబుల్స్ లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ టైటిల్ సాధించింది. ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహ్సాన్, హెండ్రా సెతియవాన్ జోడీపై 21-16, 26-24 తేడాతో విజయం సాధించింది.