Jawans: కశ్మీర్లో గడ్డకట్టించే మంచులో 'బిహూ' నృత్యం చేసిన జవాన్లు... వీడియో ఇదిగో!
- ఈశాన్య రాష్ట్రాల్లో బిహూ వేడుకలు
- సంక్రాంతి తరహాలో రైతుల పండుగగా గుర్తింపు
- కెరాన్ సెక్టార్లో బిహూ వేడుకలు జరుపుకున్న జవాన్లు
- వీడియో పంచుకున్న బీఎస్ఎఫ్
సంక్రాంతి తరహాలో, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బిహూ పండుగ జరుపుకుంటారు. ఇది ప్రధానంగా రైతుల పండుగ. పంట చేతికొచ్చిన తరుణంలో రైతులు నృత్యాలు చేస్తూ ఆనందం వెలిబుచ్చారు. కాగా, కశ్మీర్ లోని గడ్డకట్టించే మంచులో దేశ రక్షణ విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ఆనందోత్సాహాలతో బిహూ నృత్యాలు చేశారు.
"నియంత్రణ రేఖ సమీపంలో 24 గంటలూ ఎంతో ఒత్తిడి నెలకొన్న విధులు, ఇంటికి దూరంగా ఉండడం, క్లిష్టమైన మంచు పర్వతాలు, కంటికి కనిపించని ప్రమాదాలు... బిహూ నృత్యం చేయకుండా బీఎస్ఎఫ్ జవాన్లను ఇవేవీ అడ్డుకోలేవు. కెరాన్ సెక్టార్ లో సరిహద్దు వెంబడి జవాన్లు ఘనంగా బిహూ వేడుకలు జరుపుకున్నారు" అంటూ బీఎస్ఎఫ్ కశ్మీర్ విభాగం ట్విట్టర్ లో పేర్కొంది. ఈ మేరకు వీడియో కూడా పంచుకుంది.