Pandit Birju Maharaj: కథక్ నాట్యాచారుడు పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత

Kathak maestro Pandit Birju Maharaj passes away

  • కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడిన బిర్జు మహారాజ్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత
  • భారతీయ నృత్య కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారన్న ప్రధాని

ప్రముఖ కథక్ నాట్యాచార్యుడు పండిట్ బిర్జు మహారాజ్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఢిల్లీలోని సాకేత్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన బహుశా గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని బిర్జు మనవరాలు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌, లక్నోలోని ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ అసలు పేరు దుఃఖ్ హరణ్. ఆ తర్వాత దానిని పండిట్ బ్రిజ్మోహన్‌గా మార్చుకున్నారు. బ్రిజ్మోహన్ నాథ్ మిశ్రాకు పొట్టి రూపమే బిర్జూ. కథక్ డ్యాన్సర్‌గానే కాక గాయకుడిగానూ బిర్జు మహారాజ్ తనను తాను నిరూపించుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ కూడా అందుకున్న పండిట్ బిర్జుకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఖైరాగఢ్ యూనివర్సిటీలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. 1986లో భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీరావ్ మస్తానీ వంటి బాలీవుడ్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే సినిమా ‘చెస్ కే ఖిలాడీ’కి సంగీతం కూడా అందించారు. ‘దిల్‌తో పాగల్ హై’, ‘దేవదాస్’ సినిమాల్లో మాధురి దీక్షిత్‌ పాటలకు నృత్య దర్శకత్వం వహించారు. యూకే, జపాన్, యూఎస్, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో నిర్వహించిన భారతీయ పండుగల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఆయనను భారత ప్రతినిధిగా పంపింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ, సింగర్ మాలిని అవస్థి తదితరులు బిర్జు మహారాజ్ మృతికి సంతాపం తెలిపారు. భారతీయ నృత్య కళకు ప్రపంచవ్యాప్తంగా అద్వితీయమైన గుర్తింపును అందించిన పండిట్ బిర్జూ మహారాజ్ జీ మరణం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటని మోదీ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News