IIT Bombay: డిప్రెషన్ ఎంత పని చేసింది.. ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
- ఐఐటీ బాంబే క్యాంపస్ లో ఘటన
- ఏడో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
- హాస్టల్ గది నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం
మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థి మానసిక దిగులు, నిరాశ (డిప్రెషన్)కు బలైపోయాడు. తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు. ఐఐటీ బాంబే క్యాంపస్ లో ఈ విషాద ఘటన నేటి తెల్లవారుజామున జరిగింది.
26 ఏళ్ల ఒక విద్యార్థి మాస్టర్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు క్యాంపస్ లోని ఏడో ఫ్లోర్ నుంచి అతడు కిందకు దూకాడు. వెంటనే అతనిని రాజవాడి హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
విద్యార్థి హాస్టల్ గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. డిప్రెషన్ తో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.