Mahindra: అత్యధిక మైలేజీ రాకపోతే వాహనాలు వెనక్కి ఇచ్చేయండి... మహీంద్రా ఆఫర్
- బీఎస్6 శ్రేణిలో ట్రక్కులపై మహీంద్రా తాజా ప్రకటన
- తమ వాహనాలు అత్యధిక మైలేజీ ఇస్తాయన్న కంపెనీ వర్గాలు
- పలు మోడళ్లకు స్కీమ్ వర్తింపు
సరకు రవాణా వాహన విపణిలోనూ పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. మహీంద్రా గ్రూపు అనుబంధ సంస్థ మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) తాజాగా ఆసక్తికర ప్రకటన చేసింది. తమ బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని పేర్కొంది.
తమ బీఎస్6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ప్రత్యర్థి వాహనాల కంటే మైలేజీ తక్కువ ఇస్తే, వినియోగదారులు ఆ వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చని వివరించింది. బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎంటీబీ తాజా ప్రకటనలో తెలిపింది.
ఇంధన ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారుల పరంగా చూస్తే ఇది సరైన పథకం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో వీజయ్ నక్రా పేర్కొన్నారు. వినియోగదారుల పరంగా చూస్తే, ఈ స్కీమ్ ప్రవేశపెట్టడానికి ఇదే సరైన తరుణం అని వెల్లడించారు. మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని మరింత పెంపుదల చేసేందుకు తాజా స్కీమ్ ప్రకటనే నిదర్శనమని అన్నారు. రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో మహీంద్రా నిబద్ధత విశ్వసనీయమైనదని నక్రా పేర్కొన్నారు.
"మైలేజీ రాకపోతే ట్రక్కును వెనక్కి ఇవ్వండి" అనే ఈ స్కీమ్ ను మహీంద్రా 2016లో తమ బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ ట్రక్కులకు అమలు చేసింది. ఆ సమయంలో 33 వేల బ్లేజో ట్రక్కులు అమ్ముడవగా, ఏ ఒక్కటి వెనక్కి రాలేదని మహీంద్రా సంస్థ సగర్వంగా వెల్లడించింది. ఇప్పుడు బీఎస్6 ప్రమాణాలతో రూపొందించిన కొత్త వాహన శ్రేణికి కూడా ఇదే స్కీమ్ వర్తింపజేస్తోంది. మహీంద్రా సంస్థ తన వాహనాలను ఎండీఐ టెక్ ఇంజిన్లు, ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానం సహితంగా నిర్మిస్తోంది.