Tamilnadu: హాయ్ మిస్టర్ ఎలాన్ మస్క్... భారత్ ఈవీ రాజధానికి రండి!: టెస్లాకు ఆహ్వానం పలికిన తమిళనాడు మంత్రి

Tamilnadu invites Tesla to setup a plant

  • ఇటీవల ఆసక్తికర ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్
  • భారత్ లో సవాళ్లు అంటూ స్పందన
  • టెస్లాకు ద్వారాలు తెరిచిన పలు రాష్ట్రాలు
  • ఆయా రాష్ట్రాల జాబితాలో చేరిన తమిళనాడు

భారత్ లో తాము ఇప్పట్లో రంగప్రవేశం చేయలేమని, ఎన్నో సవాళ్లు తమ ముందున్నాయని, ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ పట్ల అనేక రాష్ట్రాలు స్పందించాయి. మా రాష్ట్రానికి రావాలంటే మా రాష్ట్రానికి రావాలంటూ టెస్లాకు ఆహ్వానం పలికాయి. తాజాగా ఆ రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా చేరింది.

మస్క్ కు ఆహ్వానం పలుకుతూ తమిళనాడు మంత్రి తంగం తెనరసు చేసిన ట్వీట్ ఇలా ఉంది! "హాయ్ మిస్టర్ ఎలాన్ మస్క్... మాది తమిళనాడు. భారత్ లో విద్యుత్ వాహన రంగ పెట్టుబడుల్లో తమిళనాడు వాటా 34 శాతం ఉంది. భారత్ లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తమిళనాడే రాజధాని. అంతేకాదు, ప్రపంచంలోని 9 అగ్రశ్రేణి పునరుత్పాదక ఇంధన మార్కెట్లలో తమిళనాడు ఒకటి. అందుకే మా రాష్ట్రానికి రావాలని, మీ పరిశ్రమను మా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం" అంటూ విజ్ఞప్తి చేశారు.

కాగా, టెస్లాకు ద్వారాలు తెరిచిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఐదోది. గత కొన్నిరోజుల వ్యవధిలో తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు కూడా టెస్లాకు ఎర్రతివాచీ పరుస్తామని హామీ ఇచ్చాయి.

  • Loading...

More Telugu News