telangana medical counsel: వైద్యులు జనరిక్ పేర్లనే ప్రిస్క్రిప్షన్ లో రాయాలి: తెలంగాణ వైద్య మండలి
- బ్రాండెడ్ పేర్లను సూచించరాదు
- మెడికల్ కౌన్సిల్ ఆదేశాలను పాటించాలి
- లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది
రోగులకు ప్రిస్క్రిప్షన్ పై మందులు రాసే విషయంలో వైద్యులకు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి తాజా ఆదేశాలు జారీ చేసింది. ఔషధాల జనరిక్ పేర్లనే చీటీలలో రాయాలని కోరింది. అంతేకానీ, ఔషధ బ్రాండెడ్ పేర్లను రాయవద్దని స్పష్టంగా ఆదేశించింది.
ఔషధాల బ్రాండెడ్ పేర్లకు బదులుగా, వాటిలోని కాంపౌండ్ మందులనే పేర్కొనాలంటూ గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక కేసు సందర్బంగా ఆదేశించింది. మందుల చీటీల్లో బ్రాండెడ్ పేర్లను పేర్కొనవద్దంటూ భారతీయ వైద్య మండలి సైతం ఆదేశాలు జారీ చేయగా, తెలంగాణ వైద్య మండలి వీటిని గుర్తు చేసింది. లోకాయుక్త కూడా ఇటీవలే ఈ విషయమై ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది.
‘‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్, లోకాయుక్త ఆదేశాలకు విరుద్ధంగా వైద్యులు బ్రాండెడ్ పేర్లనే సూచిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీన్ని అనుమతించం. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు విధిగా ఔషధ జనరిక్ పేర్లనే ప్రిస్క్రిప్షన్ లో సూచించాలి. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా వైద్యులు సూచించే బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే అదే కెమికల్ కాంపౌండ్ తో లభించే జనరిక్ మందుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, బ్రాండెడ్ ఔషధాలను వైద్యులు సిఫారసు చేస్తే, ఔషధ కంపెనీలు ఖరీదైన ప్రయోజనాలను పలు రూపాల్లో అందిస్తుంటాయి.