Hyderabad: హైదరాబాద్ లోనే వాహనాల వేగం ఎక్కువ.. గంటకు 25 కిలోమీటర్లు!
- బెంగళూరులో సగటు వేగం గంటకు 21 కిలోమీటర్లు
- చెన్నైలో 24 కిలోమీటర్లు
- 2019లో హైదరాబాద్ లో సగటు వేగం 23 కిలోమీటర్లు
- జీహెచ్ఎంసీతో కలసి ట్రాఫిక్ పోలీసుల చర్యలు
భాగ్యనగర వాసులు ట్రాఫిక్ రద్దీపై తరచుగా అసహనానికి లోనవుతుంటారు. పెరిగిన వాహనాలు, అప్పుడప్పుడూ ఎదురయ్యే ట్రాఫిక్ జామ్ లు చిరాకు తెప్పిస్తుంటాయి. కానీ, వాస్తవం ఏమిటంటే, మెట్రో నగరాల్లో సగటు వాహన వేగం హైదరాబాద్ నగర రోడ్లపైనే ఎక్కువట. ప్రైవేటు సంస్థల సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఢిల్లీలో 2021లో వాహనాల సగటు వేగం గంటకు 20.60 కిలోమీటర్లుగా ఉంది. ముంబై రోడ్లపై సగటు వాహన వేగం 19 కిలోమీటర్లు. కోల్ కతాలో గంటకు 19 కిలోమీటర్ల చొప్పున సగటు వాహన వేగం నమోదైంది. కానీ, దక్షిణాది నగరాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంది. చెన్నైలో 24 కిలోమీటర్లుగా ఉంటే, బెంగళూరులో 21 కిలోమీటర్ల చొప్పున ఉంది. హైదారాబాద్ లో మరింత మెరుగ్గా వాహనాల సగటు వేగం 25 కిలోమీటర్లుగా నమోదైంది. కరోనా రాక ముందు 2019లో హైదరాబాద్ లో సగటు వాహన వేగం 23 కిలోమీటర్లుగా వుండేది.
రహదారులపై అవాంతరాల్లేకుండా వాహనాలు సాగిపోయేందుకు జీహెచ్ఎంసీతో కలసి చర్యలు తీసుకుంటున్నట్టు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రహదారుల విస్తరణ, పై వంతెనల నిర్మాణంపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నట్టు చెప్పారు. ఈ చర్యలతో వాహనాల సగటు వేగం మెరుగుపడినట్టు తెలిపారు.