Telangana: ప్రికాషనరీ డోసుపై కేంద్రానికి తెలంగాణ మంత్రి హరీశ్ లేఖ.. అమెరికా, బ్రిటన్ విధానాలు అమలు చేయాలని విజ్ఞప్తి
- సెకండ్ డోస్, ప్రికాషనరీ డోసు గ్యాప్ తగ్గించాలని విజ్ఞప్తి
- కాల వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని సూచన
- ఆరోగ్య సిబ్బందికి 3 నెలలకు కుదించాలని వినతి
- 18 ఏళ్లు నిండినవారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలన్న హరీశ్
కరోనా కేసులు పెరిగిపోతుండడం, వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండడం పట్ల తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఆయన లేఖ రాశారు. కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రికాషనరీ డోసు గ్యాప్ ను కూడా తగ్గించాలని ఆయన కోరారు.
కరోనాను కట్టడి చేసేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టిందన్నారు. వ్యాధి తీవ్రత, దవాఖాన్లలో చేరే ముప్పు, మరణాలను వ్యాక్సిన్లు చాలా తగ్గించాయన్నారు.
అయితే, ఇప్పుడు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు విషయంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం ఓ సారి పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని అన్నారు. సెకండ్ డోసు, ప్రికాషనరీ డోసుకు మధ్య ఉన్న అంతరాన్ని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని హరీశ్ సూచించారు.
ఆరోగ్య కార్యకర్తల విషయంలో ప్రికాషనరీ డోసు కాల వ్యవధిని మరింత తగ్గించాలని, 9 నెలలకు బదులు 3 నెలలకు కుదించే విషయంపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర వ్యాధులతో సంబంధం లేకుండా 60 ఏళ్లుపైబడిన వాళ్లందరికీ ప్రికాషనరీ డోసు ఇవ్వాలని కోరారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. దాని వల్ల ప్రజానీకం తీవ్రమైన కరోనా బారి నుంచి తప్పించుకునే వీలుంటుందని, మరణాల ముప్పు ఉండదని హరీశ్ లేఖలో పేర్కొన్నారు.