KL Rahul: లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్ గా కేఎల్ రాహుల్!
- రాహుల్ తో పాటు స్టొయినిస్, బిష్ణోయ్ ల కొనుగోలు
- జోరు పెంచిన లక్నో ఫ్రాంచైజీ
- ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం
- వచ్చే ఐపీఎల్ సీజన్ లో రెండు కొత్త జట్లు
- లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీల అరంగేట్రం
వచ్చే ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ కూడా బరిలో దిగుతుండడం తెలిసిందే. కాగా, లీగ్ నిబంధనల ప్రకారం కొత్త ఫ్రాంచైజీలు వేలంతో సంబంధం లేకుండా ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా లక్నో ఫ్రాంచైజీ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్, దేశవాళీ క్రికెటర్ రవి బిష్ణోయ్ లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తాడని లీగ్ వర్గాలు తెలిపాయి. కాగా, ఐపీఎల్ లో ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్నారు.
కేఎల్ రాహుల్ గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. బిష్ణోయ్ కూడా పంజాబ్ కింగ్స్ ఆటగాడే. మార్కస్ స్టొయినిస్ గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు.
ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా లక్నో ఫ్రాంచైజీకి ఇంకా పేరు నిర్ణయించలేదు. తగిన పేర్లు సూచించాలంటూ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది.