Maruti Suzuki: గ్యాస్ తో నడిచే మరో కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి
- సెలెరియో ఎస్-సీఎన్జీ కారును తీసుకువచ్చిన మారుతి
- ఎక్స్ షోరూమ్ ధర రూ.6.58 లక్షలు
- పెట్రోల్ వెర్షన్ కంటే రూ.95 వేలు అధికం
- కిలో గ్యాస్ కు 35 కిమీ మైలేజి!
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని గ్యాస్ తో నడిచే మరో కారును ఆవిష్కరించింది. సెలెరియో కారులో కొత్తగా సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మోడల్ 'ఎస్-సీఎన్జీ'ని తీసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ వెర్షన్ సెలెరియో కారు ధర రూ.6.58 లక్షలు (ఎక్స్ షోరూమ్). సెలెరియో పెట్రోల్ వెర్షన్ కంటే ఇది రూ.95 వేలు అధికం.
దేశంలో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో గణనీయస్థాయిలో అమ్ముడవుతున్న కార్లలో సెలెరియో కూడా ఒకటి. మారుతి సుజుకి ఇప్పటికే ఆల్టో, ఎస్ ప్రెసో, ఈకో, వ్యాగన్ఆర్, ఎర్టిగా కార్లతో సీఎన్జీ వెర్షన్లను కూడా ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను గ్యాస్ ఆధారిత యూనిట్ గా మార్పు చేసి సెలెరియో ఎస్-సీఎన్జీ మోడల్ ను డిజైన్ చేసింది. ఇది 57 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. అయితే పెట్రోల్ ఇంజిన్ కంటే ఇది 10 బీహెచ్ పీ తక్కువ.
ఇందులో కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ పొందుపరిచారు. ఈ కారులో 60 లీటర్ల సీఎన్జీ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. కిలో గ్యాస్ కు 35.60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలంటున్నాయి. భారత్ లో పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు కృషి చేస్తున్నామని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
ఇక డిజైన్ పరంగా సెలెరియో పెట్రోల్ మోడల్ కు, సీఎన్జీ వెర్షన్ కు పెద్దగా తేడాలేదు. సెలెరియా ఎస్-సీఎన్జీ కారుపై సీఎన్జీ బ్యాడ్జ్ దర్శనమిస్తుంది. ఎయిర్ కండిషనింగ్, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్-రియర్ పవర్ విండోస్, 60:40 స్ల్పిట్ రియర్ సీట్, అడ్జస్టబుల్ మిర్రర్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ బ్రేకింగ్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ వంటి ఫీచర్లు ఈ కారులో చూడొచ్చు. మారుతి సుజుకి తన స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రీజా మోడళ్లలోనూ సీఎన్జీ వెర్షన్లు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.